ముఖ్యమంత్రే పోలీసులను నిందిస్తే ఎలా?

July 10, 2026


img

ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వాన్ని, దాని ఆదేశాలను పాటించే పోలీసులను తరచూ నిందించడం, విమర్శించడం సర్వసాధారణమే. కానీ ముఖ్యమంత్రి స్వయంగా పోలీసులను నిందించడమే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

తమిళనాడు సిఎం విజయ్‌ నేడు కరూర్ పట్టణంలో పర్యటించినప్పుడు జరిగిన సభలో మాట్లాడుతూ, “నాడు నేను ఇక్కడ సభ నిర్వహించాలనుకున్నప్పుడు భారీగా ప్రజలు తరలివచ్చిన సంగతి పోలీసులకు ముందే తెలిసి ఉన్నా నన్ను వారించలేదు. వారించి ఉంటే నేను వెనక్కి వెళ్ళిపోయేవాడిని.

అప్పుడు త్రొక్కిసలాట జరిగేది కాదు. అంతమంది చనిపోయేవారు కారు. కానీ నాటి డీఎంకే ప్రభుత్వం ఒత్తిడి వల్ల పోలీసులు ఆవిధంగా వ్యవహరించి ఉంటారని నేను భావిస్తున్నాను.

కానీ వారి మరణాలకు అందరూ నన్నే నిందించారు. నా రాజకీయ ప్రయాణం మొదలుపెట్టినప్పుడే ఇలాంటి విషాద ఘటన జరగడం నన్ను ఎంతగానో కలిచివేసింది. 

ఆ దెబ్బకి నేను రాజకీయాలకు గుడ్ బై చెప్పి పారిపోయానని దుష్ప్రచారం కూడా చేశారు. కానీ నేను ముందే చెప్పాను. అన్ని ఆటుపోట్లు తట్టుకొని నిలబడతానని. అలాగే నిలబడ్డాను. ఇప్పుడు మీ ముందున్నాను. నా ప్రభుత్వాన్ని కూల్చేయాలని కొంత మంది కలలు కంటున్నారు. అదేన్నటికీ సాధ్యం కాదు. ఇటువంటి ఆలోచనలు మానుకోవాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నాను,” అంటూ సిఎం విజయ్‌ చాల భావోద్వేగంతో మాట్లాడారు. 

కరూర్ త్రొక్కిసలాటలో చనిపోయినవారి జ్ఞాపకార్ధం పార్టీ తరపున ఒక స్థూపం నిర్మిస్తామని సిఎం విజయ్‌ ప్రకటించారు. అలాగే మృతుల కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మాట ఇచ్చారు.

దానిపై అభ్యంతరం తెలుపుతూ దాఖలైన పిటిషన్‌ని మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది. కనుక సిఎం విజయ్‌ స్వయంగా వారికి నేడు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు.


Related Post