పశ్చిమ బెంగాల్ తర్వాత బిజేపి టార్గెట్ తెలంగాణ రాష్ట్రమేనని ప్రధాని మోడీ స్వయంగా ప్రకటించి వెళ్ళారు. అలా టార్గెట్ పెట్టుకున్న రాష్ట్రాలన్నిటినీ బిజేపి వరుసగా గెలుచుకుంది కనుక ఆయన మాటలను ‘రొటీన్’ అని కొట్టిపడేదేయలేము. తాజాగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా హైదరాబాద్ పర్యటనకు రావడం, ఆయన రాష్ట్ర బిజేపి నేతలకు చేసిన సూచనలు విన్నప్పుడు బిజేపి తన లక్ష్యం సాధించే దిశలో అడుగులు వేస్తున్నట్లనిపిస్తుంది.
జేపీ నడ్డా చేసిన సూచనలు క్లుప్తంగా..
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అవినీతి పాలనతో ప్రజలు విసుగెత్తిపోయి ఉన్నారు. కానీ వాటిపట్ల ప్రజలలో నెలకొన్న వ్యతిరేకత మనల్ని గెలిపించి అధికారంలోకి తెస్తుందనే భ్రమలో ఉండొద్దు. పార్టీలో ప్రతీ ఒక్కరూ కష్టపడి పని చేయాలి. విభేదాలు, పంతాలు పట్టింపులు పక్కన పెట్టి అందరూ కలిసి కట్టుగా పనిచేయాలి.
నేతలందరూ నిత్యం ప్రజల మద్య ఉంటూ వారి సమస్యలపై పోరాడాలి. అలాగే అటు ప్రజలతో, ఇటు కార్యకర్తలతో అభిమానంగా మెసులుకుంటూ అందరినీ కలుపుకుపోవాలి.
పార్టీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఇతర పార్టీల నేతలను పార్టీలోకి ఆహ్వానించి తీసుకురండి. వేర్లు లేని చెట్టు ఎంత పెద్దదనా కూలిపోతుంది. కనుక వేర్లు లెన్ని చెట్టులా కాక మర్రిచెట్టులా బలంగా పెరగాలి. విస్తరించాలి. నేతల మద్య సయోధ్య, కార్యకర్తలతో బలమైన అనుబంధం ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. గత ఎన్నికలలో అధికారంలోకి రాగల అవకాశాన్ని చేజార్చుకున్నాము. మళ్ళీ మరోసారి అలా కాకుండా జాగ్రత్త పడండి,” అంటూ జేపీ నడ్డా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.