శనివారం మిడ్జిల్‌లో జరిగిన బహిరంగ సభలో సిఎం రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “దేశానికి రాహుల్ గాంధీ నాయకత్వం చాలా అవసరం. ఇది చారిత్రిక అవసరం. అయన ప్రధాని అయితేనే దేశంలో మళ్ళీ మత సామరస్యం ఏర్పడుతుంది.
కనుక తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతగా రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకుందాం. నేను ఏవిధంగా ఈ మిడ్జిల్ నుంచే ఈ స్థాయికి ఎదిగానో అదేవిధంగా రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు ప్రయత్నాలు కూడా ఇక్కడి నుంచే మొదలవ్వాలని కోరుకుంటున్నాను.
రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు నావంతు ప్రయత్నాలు నేను చేస్తాను. మీరందరూ కూడా నాకు తోడుగా నిలబడితే తప్పకుండా మన ప్రయత్నం నెరవేరుతుంది,” అని అన్నారు.
ఓ కాంగ్రెస్ నాయకుడుగా, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రాహుల్ గాంధీని ప్రధాని కావాలని సిఎం రేవంత్ రెడ్డి కోరుకోవడం ఆశ్చర్యం కలిగించదు. తప్పు కాదు. కానీ సిఎం రేవంత్ రెడ్డి ఏవిధంగా తన స్వయంకృషి, శక్తిసామర్ధ్యాలతో ఈ స్థాయికి ఎదిగారో, రాహుల్ గాంధీ కూడా ఆవిధంగా లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ప్రధాన మంత్రి అయితే ఆయనకు హుందాగా, గౌరవంగా ఉంటుంది.
అనేక భాషలు, కులమతాలు, సంస్కృతులతో 140 కోట్లకు పైగా జనాభా ఉన్న సువిశాలమైన ఈ దేశాన్ని పాలించాలంటే అందుకు తను అర్హుడినని రాహుల్ గాంధీ స్వయంగా నిరూపించుకోవాలి. కానీ ఈవిధంగా దేశంలో కాంగ్రెస్ నేతలందరూ తలో చెయ్యేసి ప్రధాని కుర్చీలో కూర్చోపెట్టాలనుకోవడం, అందుకు ప్రజలు సహకరించాలని కోరడం ఏం బాగుంది?