తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం నేటితో 20 ఏళ్ళు పూర్తయ్యాయి. సరిగ్గా 20 ఏళ్ళ క్రితం ఇదే రోజున అంటే 2006, జూలై 4న మహబూబ్‌నగర్ జిల్లాలోని మిడ్జిల్ జెడ్పీటీసీ సభ్యుడిగా గెలవడంతో రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు.
తర్వాత టీడీపిలో చేరి 2007లో తొలిసారిగా ఎమ్మెల్సీ అయ్యారు. ఆ తర్వాత 2009, 2014 ఎన్నికల్లో కొడంగల్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మారిన రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని 2017లో టీడీపికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
2018 శాసనసభ ఎన్నికలలో కోడంగల్ నుంచి పోటీ చేసి ఓడిపోయినా 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసి గెలిచారు. 2021లో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకి తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించడంతో, పార్టీలో అందరినీ ఒక్క తాటిపైకి తెచ్చి తిరుగేలేదనుకున్న బీఆర్ఎస్ పార్టీని ఓడించి తొలిసారిగా కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకువచ్చారు. పార్టీని గెలిపించి అధికారంలోకి తెచ్చినందుకు కాంగ్రెస్ అధిష్టానం అయననే సిఎం పదవి కట్టబెట్టింది.
మూడు లేదా ఆరు నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని హరీష్ రావు, కేటీఆర్ కలలు పగటి కలలని నిరూపిస్తూ సిఎంగా రెండున్నరేళ్ళు పూర్తిచేశారు. మరోసారి నేనే ముఖ్యమంత్రినవుతానని పూర్తి నమ్మకం, ఆత్మవిశ్వాసంతో చెపుతున్నారు కూడా.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినప్పటికీ జెడ్పీటీసీ సభ్యుడుగా తన రాజకీయ జీవితానికి బలమైన పునాది వేసిన మిడ్జిల్ మండల ప్రజలను మాత్రం మరిచిపోలేదు. నేడు మిడ్జిల్ మండల కేంద్రంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని తన ఈ రాజకీయ ఉన్నతికి పునాది వేసిన ప్రజలకు, అనుచరులు, పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుకోబోతున్నారు.