టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల కమీషన్ పెద్ద షాక్ ఇచ్చింది. ‘టీఆర్ఎస్’ పేరుపై 700కి పైగా అభ్యంతరాలు వచ్చినందున పార్టీ పేరు మార్చుకోవాలని సూచిస్తూ లేఖ వ్రాసింది.
ఈసీ లేఖపై కల్వకుంట్ల కవిత స్పందిస్తూ, “ఈసీకి వచ్చిన అభ్యంతరాలలో కేవలం రెండే రెండు మాకు పంపించి పార్టీ పేరు మార్చుకోమని సూచించడం తగదు. మా పార్టీ పేరు విషయంలో మాపై ఒత్తిడి చేస్తే, దాని కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్ళి న్యాయ పోరాటం చేస్తాను. ఈసీకి అందిన అభ్యంతరాలన్నిటినీ మాకు పంపిస్తే వాటిని పరిశీలించి మా సమాధానం చెప్తాం,” అని అన్నారు.
అయితే ఇలాంటి విషయాలలో ఈసీ గోప్యత పాటించాల్సి ఉంటుంది. ఎందువల్లనంటే వాటిలో బహుశః బీఆర్ఎస్ పార్టీ లేదా దాని మద్దతుదారులు, రాష్ట్రంలో ఇతర పార్టీలు వాటి మద్దతుదారుల లేఖలు ఉండవచ్చు.
వాటన్నిటినీ ఆమెకు అందజేస్తే ఈసీ కూడా న్యాయపరమైన సమస్యలలో చిక్కుకునే అవకాశం ఉంటుంది. కనుక బంతి ఆమె కోర్టులోనే ఉందని భావించవచ్చు. న్యాయపోరాటం చేస్తానని చెప్పారు కనుక చేయక తప్పదేమో?