డీఎస్పీ భీమ్‌రెడ్డి ఆస్తుల విలువ రూ.200 కోట్లు పైనే!

July 03, 2026


img

తెలంగాణ ఏసీబీ అధికారులు ఎన్నిసార్లు వల వేస్తే అన్నిసార్లు అవినీతి చేపలు వలలో చిక్కుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న సంకిరెడ్డి భీమ్‌రెడ్డి వలలో చిక్కారు. 

హైదరాబాద్‌తో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తం 16 ప్రాంతాల్లో ఏకకాలంలో అయన నివాసంతో పాటు బంధువులు, సన్నిహితులు, బినామీలకు చెందిన ఇళ్ళల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఏకంగా రూ. 200 కోట్లు మార్కెట్ విలువ కలిగిన స్థిర, చర ఆస్తులను గుర్తించారు. 

ఏసీబీ అధికారులు సోదాల్లో విల్లాలు, ఫ్లాట్లు, వాణిజ్య భవనాల్లో వాటాలు, కమర్షియల్ స్థలాలు, వ్యవసాయ భూములు, ఓపెన్ ప్లాట్లు, ఇంకా వివిధ సంస్థలలో పెట్టుబడులున్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు పరిసర ప్రాంతాల్లో భూములు, కర్ణాటకలో వ్యవసాయ భూములున్నట్లు గుర్తించారు. ఖనిజ వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వివరాలు కూడా బయటపడినట్లు తెలుస్తోంది.

సోదాలలో భారీగా నగదు, వెండి బంగారు ఆభరణాలు, విదేశీ మద్యం సీసాలు, బ్యాంకు డిపాజిట్లకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

భీమ్‌రెడ్డి గతంలో హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలోని పలు కీలక పోలీస్ స్టేషన్లు, విభాగాల్లో పనిచేశారు. ప్రస్తుతం ఆయనపై అవినీతి నిరోధక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.


Related Post