సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మూసీ ప్రాజెక్టు మొదటి దశ పనులకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి “మూసీకి మంచి నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు? ఎన్ని టీఎంసిలు అందించగలమో చెప్పాలని సిఎం రేవంత్ రెడ్డిని అడిగారు. గోదావరి నుంచి 20 టీఎంసిలు ఎత్తిపోస్తే దానిలో నగర అవసరాలకు 17.5 టీఎంసిలు కేటాయించాల్సి ఉంటుంది. మిగిలిన 2.5 టీఎంసిలు మూసీకి మళ్ళిస్తారా? ఈ ప్రాజెక్టుపై ఖర్చు చేయబోతున్న దానికి ఎంత నిష్పత్తిలో ఆదాయం సమకూరుతుందో లెక్కలు ఉన్నాయా?” అని ప్రశ్నించినట్లు సమాచారం.
ఒకరిద్దరు మంత్రులతో పాటు సిఎం రేవంత్ రెడ్డి కూడా అయన ప్రశ్నలపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీటన్నిటిపై చర్చించామని, మళ్ళీ అవే ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారని నిలదీసినట్లు తెలుస్తోంది. మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న మూసీ ప్రాజెక్టుని అడ్డుకోవాలని బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ప్రయత్నిస్తున్నప్పుడు, మనమంతా ముక్త కంఠంతో వారికి సమాధానం చెప్పాలి. కానీ మనలో మనమే ప్రతిపక్షనేతల్లా మాట్లాడటడం సబబు కాదని సిఎం రేవంత్ రెడ్డి హితవు పలికినట్లు తెలుస్తోంది.
సాగునీటి శాఖలో పలు ప్రాజెక్టుల ఫైళ్ళు మంత్రివర్గ సమావేశానికి అధికారులు అందించడం లేదనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ వివరణ ఇచ్చారు.
“పలు ప్రాజెక్టు పనులలో అంచనాలు సవరించడం సర్వసాధారణమే. మంత్రివర్గ సమావేశానికి ఒక రోజు ముందు కార్యదర్శులు పంపిన ఫైల్స్ నా వద్దకు వచ్చాయి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించకుండా మంత్రివర్గ సమావేశానికి అందించడం సబబు కాదు. కనుక వచ్చే సమావేశానికి ఆ ఫైల్స్ అన్నీ సమర్పిస్తామని తెలిపారు.
సిఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ, “ఈ నెల 17న జరిగే మంత్రివర్గ సమావేశంలో మొట్ట మొదట ఈ ఫైల్స్ గురించి చర్చిద్దాం,” అని చెప్పారు.