కేసీఆర్‌ కుటుంబానికి అన్ని ఫామ్‌హౌసులు ఎలా వచ్చాయి?

July 05, 2026


img

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి రాజకీయాలలోకి వచ్చి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌లో జరిగిన బహిరంగ సభలో తన రాజకీయ జీవితానికి బలమైన పునాది వేసిన మిడ్జిల్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకున్నారు. 

తర్వాత కేసీఆర్‌ హయంలో జరిగిన అక్రమాలు, దోపిడీల గురించి వివరిస్తూ, “తెలంగాణ ఏర్పడినందుకు కేసీఆర్‌ కుటుంబానికి లక్ష కోట్లు రాగా, రాష్ట్రానికి రూ. 8.21 లక్షల కోట్లు అప్పులు మిగిలాయి. కల్వకుంట్ల కుటుంబానికి భారీగా ఆస్తులు, పదవులు, ఫామ్‌హౌసులు, వారిని ఎన్నుకున్న పాపానికి ప్రజలకు అప్పులు, నిరుద్యోగం, పేదరికం మిగిల్చారు. 

బతుకమ్మ చీరలు మొదలు కాళేశ్వరం వరకు ప్రతీ చోట కమీషన్లు దండుకున్నారు. లేకుంటే గజ్వేలలో కేసీఆర్‌కి వెయ్యెకరాలలో ఫామ్‌హౌసు, కేటీఆర్‌కి వంద ఎకరాలలో ఫామ్‌హౌసు, హరీష్‌ రావుకి మొయినాబాద్‌లో 50 ఎకరాలలో ఫామ్‌హౌసు, కవితకు శంకరపల్లిలో 25 ఎకరాలలో ఫామ్‌హౌసులు ఎలా వచ్చాయి? ఇవన్నీ మీ తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులు కాదు కదా? తెలంగాణ ప్రజలను దోచుకొని సంపాదించినవే కదా?

మీ ప్రభుత్వం దిగిపోయినా మీ అవినీతి రుచి మరిగిన అధికారులు ఇంకా రాష్ట్రాన్ని దోచుకుంటూనే ఉన్నారు. ఏసీబీ అధికారుల దాడులలో 100,200,300 కోట్లు ఆస్తులు సంపాదించిన అవినీతి అధికారులు పట్టుబడుతున్నారు. తెలంగాణ ఏర్పడితే ప్రజల బతుకులు బాగుపడతాయనుకుంటే, కేసీఆర్‌ కుటుంబం ఒక్కటే బాగుపడింది. ప్రజలెన్నుకున్న మా ప్రజా ప్రభుత్వం పోవాలని బీఆర్ఎస్‌ ఎందుకు కోరుకుంటోందంటే మళ్ళీ రాష్ట్రాన్ని దోచుకోవడానికే,” అంటూ సిఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.        



Related Post