కరీంనగర్‌లో మహిళా కూలిని దోచుకొని హత్యాయత్నం!

July 05, 2026
img

కరీంనగర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కూలి పని ఇప్పిస్తానని నమ్మించి తీసుకు వెళ్ళిన ఓ వ్యక్తి ఆమెని శివారు ప్రాంతానికి తీసుకువెళ్ళి ఆమె ఒంటిపై ఉన్న బంగారం, చేతిలో ఉన్న నగదు దోచుకుని ఆమెను బావిలోకి తోసేసి పరారయ్యాడు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కిసాన్ నగర్‌కు చెందిన గంగాధర లక్ష్మీ (55) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఎప్పటిలాగే ఆమె కొడుకు సందీప్ కూలి అడ్డ వద్ద తల్లిని దింపి వెళ్ళిపోయాడు. 

కొంత సేపటికి ఓ గుర్తు తెలియని వ్యక్తి కూలి పని ఉందని చెప్పి లక్ష్మీని నుస్తులాపూర్ గ్రామ శివారుకు తీసుకెళ్ళాడు. ఆమె వద్ద ఉన్న అరతులం బంగారం, ఆమె చేతిలో ఉన్న కొంత సొమ్ము లాక్కుని ఆమెను పక్కనే ఉన్న బావిలోకి తోసేశాడు.

బావిలో పడిన లక్ష్మీ తాడును పట్టుకుని పైకి వచ్చే ప్రయత్నం చేయగా, దుండగుడు ఆ తాడు కోసేసి అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో ఆమె బావిలో ఓ పైపును పట్టుకుని సాయం కోసం కేకలు వేస్తూనే ఉంది. కానీ బావి గ్రామ్ శివారులో ఉన్నందున అటువైపు ఎవరూ రాకపోవడంతో 21 గంటల సేపు బావిలోనే ఉండిపోయింది. 

రాత్రవుతున్నా తల్లి ఇంటికి రాకపోవడంతో ఆమె కొడుకు సందీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా పోలీసులు స్తులాన్‌పూర్ గ్రామ పరిసరాల్లో గాలించినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు.

మరుసటి రోజు ఉదయం అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి బావిలో నుంచి ఆమె కేకలు విని తొంగి చూడగా లక్ష్మి కనిపించడంతో గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. అనంతరం గ్రామస్తులు కలిసి ఆమెను సురక్షితంగా బయటికి తీశారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.


Related Post