మాజీ మంత్రి హరీష్ రావు తనకు ఓ మూడు నెలలు మంత్రి పదవి ఇస్తే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్ళు పారించి చూపుతానంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాలు విసిరారు.
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ, “మీరు పదేళ్ళు మంత్రిగా ఉండి ఏం చేశారు? మీరు స్వయంగా దగ్గరుండి కట్టించిన మేడిగడ్డ బ్యారేజ్ క్రుంగిపోయింది. అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు బీటలు వారాయి. పదేళ్ళలో చేయలేని పనిని మూడు నెలల్లో చేసి చూపిస్తానని, మూడు నెలలు మంత్రి పదవి ఇవ్వాలని కోరడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
మీకు మంత్రి పదవి కావాలనుకుంటే ముందుగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాలి. అందుకు సిద్దమైతే మేము మా పార్టీలో చర్చించి మా నిర్ణయం చెప్తాము,” అని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ వద్ద రూ.1,400 కోట్లు ఉన్నాయనే కల్వకుంట్ల కవిత ఆరోపణలు వాస్తవమేనని భావిస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కల్వకుంట్ల కవిత చేసిన ఈ ఆరోపణపై బీఆర్ఎస్ అధిష్టానం స్పందించాలని గౌడ్ కోరారు.