తమిళనాడు సిఎం విజయ్ చివరిగా చేసిన ‘జన నాయగన్’కు ఎట్టకేలకు సెన్సార్ బోర్డ్ నుంచి మోక్షం లభించింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికేట్ జారీ చేసిందని, జూలై 23న విడుదల కాబోతోందని సోషల్ మీడియాలో ఊహాగానాలు వస్తే వాటిని చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది. కానీ గంటల వ్యవధిలోనే ఆ ఊహాగానాలు నిజమేనని ధృవీకరణ అయ్యింది. జన నాయగన్‌కు సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సినిమా నిడివి మూడు గంటల మూడు నిమిషాలు.
ఈ ఏడాది సంక్రాంతికి పండుగాకే జన నాయగన్ విడుదల కావాల్సి ఉండగా సెన్సార్ బోర్డ్ అభ్యంతరాల కారణంగా ఇంతవరకు విడుదల కాలేదు. కానీ ఇప్పుడు సెన్సార్ బోర్డ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ముందే చెప్పుకున్నట్లు ఈ నెల 24న విడుదల చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు.
అయితే కొందరు దుండగులు పూర్తి సినిమాని కొన్ని వారాల క్రితమే సోషల్ మీడియాలో లీక్ చేయడంతో దాదాపు 1.20 కోట్ల మంది చూసినట్లు అంచనా వేశారు. సినిమా ఫుటేజ్‌ను అక్రమంగా ఇంటర్నెట్‌లో లీక్ చేసిన కేసులో చెన్నై పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారి బెయిల్ పిటిషన్లపై మద్రాస్ హైకోర్టు విచారణ జరుపుతోంది.
కనుక ఇంత ఆలస్యంగా, సోషల్ మీడియాలో లీక్ అయిన తర్వాత విడుదల కాబోతున్న ‘జన నాయగన్’ని ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా?అనే అనుమానాలున్నాయి.
హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జన నాయగన్’లో విజయ్‌కి జోడీగా పూజా హెగ్డే నటించగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్ర చేశారు. మమితా బైజు, ప్రకాశ్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె.నారాయణ నిర్మించారు.