తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘జన నాయగన్’ ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా సెన్సార్ బోర్డ్ అభ్యంతరాల కారణంగా ఇంతవరకు విడుదల కాలేదు. కానీ ఇప్పుడు విజయ్ తమిళనాడు సిఎం అయ్యారు కనుక జన నాయగన్ విడుదలవుతుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపధ్యంలో ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికేట్ జారీ చేసిందని, జూలై 23న ‘జన నాయగన్’ విడుదల కాబోతోందని సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపించాయి.
ఈ విషయం చిత్ర నిర్మాణ సంస్థ దృష్టికి రావడంతో అవి కేవలం పుకార్లే అని స్పష్టం చేసింది. సెన్సార్ బోర్డు సూచించిన కొన్ని మార్పులను చిత్ర బృందం చేస్తోందని అవి పూర్తి చేసిన తర్వాత సినిమాను మళ్ళీ సెన్సార్ బోర్డుకు పంపిస్తామని తెలిపింది.
‘జన నాయగన్’ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని అభిమానులను కోరింది. సెన్సార్ పనులు పూర్తయితే తామే స్వయంగా అధికారిక ప్రకటన చేస్తామని సదరు నిర్మాణ సంస్థ తెలిపింది.
ఇదిలా ఉండగా, ఈ సినిమాకు సంబంధించిన మరో కీలక పరిణామం కూడా చోటుచేసుకుంది. సినిమా ఫుటేజ్‌ను అక్రమంగా ఇంటర్నెట్‌లో లీక్ చేసిన కేసులో చెన్నై పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారి బెయిల్ పిటిషన్లపై మద్రాస్ హైకోర్టు విచారణ జరుపుతోంది.
హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జన నాయగన్’లో విజయ్‌కి జోడీగా పూజా హెగ్డే నటించగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్ర చేశారు. మమితా బైజు, ప్రకాశ్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె.నారాయణ నిర్మించారు.