పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని పొనుగంటి నిరంజన్ (17) బుధవారం తెల్లవారుజామున కన్నుమూశాడు. హనుమకొండకు చెందిన 17 ఏళ్ళ నిరంజన్ అరుదైన న్యూరోమస్కులర్ జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచాడు.
తన వీరాభిమాని నిరంజన్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఇటీవల హనుమకొండలోని నిరంజన్ ఇంటికి వెళ్ళి పరామర్శించారు. కొంతసేపు అతనితో ఆప్యాయంగా మాట్లాడి ధైర్యం చెప్పారు. నిరంజన్‌కు బహుమతులు, తిరుమల శ్రీవారి ప్రసాదాలను పవన్ కళ్యాణ్ ఇచ్చారు.
తాను నటించబోయే ఓజీ-2 సినిమాను కలిసి చూద్దామని, ఆ సినిమా ఈవెంట్‌కి నిన్ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానిస్తానని చెప్పడంతో ఆ బాలుడు చాలా సంతోషపడ్డాడు.
కానీ నిరంజన్ మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పవన్ కళ్యాణ్ అభిమానులు నిరంజన్‌కు నివాళులు అర్పిస్తూ సోషల్ మీడియాలో సంతాప సందేశాలు పోస్టు చేస్తున్నారు.