నవ దంపతుల ముచ్చటకి టీటీఈ సస్పెండ్!

July 09, 2026
img

ఇప్పుడు పెళ్ళి చేసుకోబోతున్న జంటలు ప్రీ-వెడ్డింగ్ షూట్, బాచిలర్ పార్టీలు, సంగీత్ కార్యక్రమంలో వధూవరులు, వారి తల్లితండ్రులు, బంధుమిత్రులు డాన్సులు చేయడం వంటివి వివాహ వేడుకల్లో భాగంగా మారిపోయాయి. ఆ తర్వాత ఘటం శోభనం నవ దంపతులకు చాలా ప్రత్యేకమైనది. అది ఎవరితో పంచుకోలేని ఓ మధుర జ్ఞాపకంగా వారిద్దరి మధ్యే ఉండిపోతుంది. కానీ ఆ మధుర క్షణాలను కదులుతున్న రైల్లో ఆస్వాదించాలనుకోవడమే ఓ రైల్వే ఉద్యోగి కొంప ముంచింది. 

మహారాష్ట్రలోని బల్లార్ష నుంచి ముంబై వెళ్ళే నందిగామ్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన జరిగింది. ఫస్ట్ ఏసీ కోచ్‌లోని కూపేను బుక్ చేసుకున్న ఆ జంట, దానిని శోభనం గదిని తలపించేలా పూలతో అలంకరింపజేశారు. రైల్లో ‘శోభనం గది’ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో క్షణాల్లో వైరల్ అయింది.

దీనిపై కొందరు చిలిపి ప్రశ్నలు, వ్యాఖ్యలు చేయగా మరికొందరు ఇది సరికాదంటూ విమర్శలు గుప్పించారు. ఈ విషయం రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళడంతో వెంటనే విచారణ జరిపి ఈ ఏర్పాటుని అనుమతించినందుకు సదరు టీటీఈని ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేశారు.

ఈ ఘటనపై రైల్వే అధికారులు స్పందిస్తూ, రైళ్ళు ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడానికి, వారి ప్రయాణం మరింత సుఖవంతంగా సాగేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తుంది తప్ప ఇలాంటివి అనుమతించబోమని స్పష్టం చేశారు. 

రైళ్ళలో సాటి ప్రయాణికులకు అసౌకర్యం, అభ్యంతరకరమైన ఎటువంటి చర్యలను అనుమతించే ప్రసక్తి లేదని చెప్పారు. ఏమాత్రం సహించబోమని తెలిపారు.

Video courtesy: Telugu Scribe)

Related Post