పోక్సో కేసులో అరెస్ట్ అయ్యి గత 49 రోజులుగా చర్లపల్లి జైలులో జ్యూడిషియల్ రిమాండ్లో ఉన్న బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు ఊరట కల్పించింది. అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
లక్ష రూపాయల చొప్పున ఇద్దరు వ్యక్తుల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. అలాగే దర్యాప్తు అధికారులతో పూర్తిగా సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నం చేయరాదని, కేసు విచారణకు ఎలాంటి ఆటంకం కలిగించకూడదని స్పష్టమైన షరతులు విధించింది. ఈ షరతులకు అతని తరపు న్యాయవాది అంగీకరించడంతో హైకోర్టు గురువారం బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరు చేసింది.
బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ విచారణలో ప్రాసిక్యూషన్, బాధితురాలి తరఫు న్యాయవాదులు అతనికి బెయిల్ మంజూరు చేయవద్దని వాదించినప్పటికీ, అతను ఇప్పటికే 49 రోజులుగా చర్లపల్లి జైలులో ఉన్నాడని, కోర్టు షరతులకు కట్టుబడి ఉంటాడని భగీరథ్ తరఫు న్యాయవాదుల అభ్యర్ధనపై సానుకూలంగా స్పందిస్తూ బెయిల్ మంజూరు చేసింది.
కోర్టు ఉత్తర్వులు ఈరోజు సాయంత్రంలోగా జైలు అధికారుల చేతికి అందితే ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం భగీరథ్ జైలు నుంచి విడుదలవుతాడు.