తెలుగు సినీ నటి ‘కలర్స్’ స్వాతి రెడ్డి జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. 'మంత్ ఆఫ్ మధు' దర్శకుడు శ్రీకాంత్ నాగోతి, స్వాతిరెడ్డి బుధవారం నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. తమ పెళ్ళి ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.
‘కలర్స్’ కార్యక్రమంతో టీవీ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న స్వాతి, ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు.
2018 ఆగస్టు 30న కేరళకు చెందిన పైలట్ వికాస్ వాసును ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు భర్తతో కలిసి ఇండోనేషియాలో నివసించారు. వారి మద్య మనస్పర్ధలు ఏర్పడటంతో విడిపోయారు.
మొదటి వివాహ బంధం ఆవిధంగా ముగిసిన తర్వాత స్వాతి తిరిగి సినీ రంగంలోకి అడుగుపెట్టారు. దర్శకుడు శ్రీకాంత్ నాగోటి తెరకెక్కించిన 'మంత్ ఆఫ్ మధు' చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి అది క్రమంగా ప్రేమగా, ఇప్పుడు వివాహ బంధంగా మారింది.
సినీ ప్రముఖులు, అభిమానులు ఈ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.