ఈ నెల 16 నుంచి ఆషాడ బోనాలు ప్రారంభం కాబోతున్నాయి. మంత్రి కొండా సురేఖ నేడు గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారి దేవస్థానంలో సమన్వయ కమిటీ సమావేశంలో వీటి ఏర్పాట్ల గురించి చర్చించారు.
ఈసారి కూడా ఆనవాయితీ ప్రకారం ముందుగా జూలై 16న గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి ప్రభుత్వం తరపున తొలిబోనం సమర్పించిన తర్వాత ఉత్సవాలు ప్రారంభమవుతాయి. లంగర్ హౌస్ నుంచి ప్రారంభమయ్యే ఊరేగింపులో లక్షల మంది భక్తులు పాల్గొంటారు. కనుక వారికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి కొండా సురేఖ సమావేశంలో పాల్గొన్న సంబందిత శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఆగస్ట్ 13వరకు నగరంలో వివిధ ప్రాంతాలలో అమ్మవారి ఆలయాలలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. సమావేశం అనంతరం మంత్రి కొండా సురేఖ ఆషాడ బోనాలు ఉత్సవాల పోస్టర్ విడుదల చేశారు.
ఈ సమావేశంలో దేవాదాయశాఖ డైరెక్టర్ హనుమంతరావు, సాంస్కృతికశాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, విద్యుత్, వైద్య, ఆరోగ్యశాఖ, జిహెచ్‌ఎంసి, తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.