తెలంగాణలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియకు గడువును ఆగస్టు 3 వరకు పొడిగిస్తూ సవరించిన షెడ్యూల్‌ను ప్రకటించింది.
కొత్త షెడ్యూల్ ప్రకారం బూత్ లెవల్ అధికారులు ఇంటింటి సర్వే, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ కార్యక్రమాన్ని ఆగస్టు 3 వరకు కొనసాగించనున్నారు. ఇప్పటివరకు ఫారాలు అందనివారు లేదా సమర్పించనివారు ఈ గడువులోగా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు.
ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత ఆగస్టు 10న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. అనంతరం అభ్యంతరాలు, సవరణల కోసం అవకాశం కల్పించి, పరిశీలన పూర్తయ్యాక అక్టోబర్ 8వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేసి అక్టోబర్ 12న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చాలా మందికి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసినప్పటికీ, కొంతమంది ఓటర్లకు ఇంకా ఫారాలు అందలేదన్న ఫిర్యాదులు రావడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్ధన మేరకు గడువు పెంచుతున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ ఆగస్ట్ 3లోగా ఈ ప్రక్రియ పూర్తిచేసేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేసింది. .
రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతీ ఓటరు తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారం సమర్పించాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఎన్యూమరేషన్ ఫారాలు నింపి ఇచ్చిన ఓటర్లు తమ వివరాల్లో సవరణలు చేసుకోవాలనుకుంటే వారు కూడా పొడిగించిన గడువులోగా మార్చుకోవచ్చని తెలిపారు.