తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి నిన్న ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని మత్కేపల్లి చౌరస్తాలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో రైతు భరోసా పధకం కొరకు బటన్ నొక్కి రూ.1,009 కోట్లు నిధులు విడుదల చేశారు. ఈ సభలో సిఎం రేవంత్ రెడ్డి “భద్రాచలం రాముడి మీద ఒట్టేసి చెప్తున్నా.. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లు గెలిచుకొని మళ్ళీ అధికారంలో వస్తుంది. వచ్చే ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాలలో బీఆర్ఎస్ పార్టీ కనపడకుండా చేస్తా. గతంలో చేసిన శపధాలు ఎలా నేరవేర్చుకున్నానో అలాగే ఇవీ నేరవేర్చుకుంటాము,” అని అన్నారు.
హరీష్ రావు సవాళ్ళపై స్పందిస్తూ, “అయన బిజేపి పెద్దలతో రహస్య మంతనాలు చేస్తున్నారు. ఏదో రోజున బీఆర్ఎస్ పార్టీని బిజేపిలో విలీనం చేసేయడం ఖాయం. ఈ మాట కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బయటపెట్టారు కదా? బిజేపితో మంతనాలు జరపడం లేదని భద్రాద్రి రామయ్యపై హరీష్ రావు ఒట్టేసి చెప్పగలరా? బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో రూ. 1,400 కోట్లు అవినీతి సొమ్ము ఉందని కవిత ఆరోపిస్తే, కేటీఆర్ ఎందుకు స్పందించలేదు. కవిత చేసిన ఈ ఆరోపణపై కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలి,” అని సిఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
డీలిమిటేషన్‌పై బిజేపి, బీఆర్ఎస్ పార్టీలు ఏమీ మాట్లాడటం లేదు. కానీ సిఎం రేవంత్ రెడ్డి మాత్రం తప్పకుండా జరుగుతుందని అప్పుడు తెలంగాణలో ఎంపీ సీట్లు 26కి, ఎమ్మెల్యే సీట్లు 182కి పెరుగుతాయని, వాటిలో 20 ఎంపీ సీట్లు, 117 ఎమ్మెల్యే సీట్లు మేమే గెలుచుకుంటామని చెప్పడం విశేషం.