ఇటీవల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన సోదరుడు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని ఉద్దేశ్యించి నగరంలో ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్ యాజమాన్యంతో కుమ్మక్కయ్యి అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్న ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్‌ని తాను ప్రశ్నిస్తూనే ఉంటానని ఆమె హెచ్చరించారు.
ఇదే సమయంలో ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్‌కి హైడ్రా నోటీసులు జారీ చేయడం విశేషం. సోమాజీగూడాలో రాజ్ భవన్‌లో రోడ్డులో ఆ సంస్థ 17 అంతస్తుల భవన సముదాయాలు నిర్మిస్తోంది. అవి హుస్సేన్ సాగర్ ఎఫ్‌టిఎల్ పరిధిలో ఉన్నట్లు గుర్తించిన హైడ్రా వాటి నిర్మాణ అనుమతులు ఎందుకు రద్దు చేయరాదో వివరణ ఇవ్వాలని కోరుతూ ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్‌కి షోకాజ్ నోటీస్ జారీ చేసింది.
కల్వకుంట్ల కవిత ఆరోపిస్తున్నట్లు ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్ వెనుక కేటీఆర్ ఉన్నట్లయితే, ఆయన మున్సిపల్ శాఖా మంత్రిగా ఉన్నప్పుడే వాటికి అనుమతులు మంజూరు చేసి ఉండి ఉంటే ముందుగా అయన, ఆ తర్వాత అక్కడ ఆ భవనాలు నిర్మించేందుకు అనుమతించిన అధికారులు చిక్కులో పడతారు.
ఈ ప్రాజెక్టుపై ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్ ఇప్పటికే భారీగా ఖర్చుచేసింది కనుక దానిని కాపాడుకోవడానికి న్యాయ పోరాటం మొదలుపెడితే, దానికి సమాంతరంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మద్య రాజకీయ పోరాటాలు కూడా ప్రారంభం కావచ్చు.
ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నాగేందర్ హైడ్రా నోటీస్ పంపడాన్ని స్వాగతిస్తున్నానని, తాను కూడా ఈ పోరాటంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాని అన్నారు.
హైడ్రా నోటీసుకి ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్ ఇవ్వబోయే సమాధానం బట్టి తదుపరి పరిణామాలు ఏవిధంగా ఉండబోతున్నాయో అర్ధమవుతుంది.