70 వేల నియామక పత్రాలు వెళ్ళి చూసుకోవచ్చు: సిఎం రేవంత్

July 18, 2026


img

నేడు సరూర్ నగర్‌లో యువ సంగ్రామ సభ పేరుతో బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఉద్యోగాల భర్తీపై నిలదీయగా, ఆయనకు సిఎం రేవంత్ రెడ్డి అంతే ధీటుగా సమాధానం చెప్పారు. 

ప్రముఖ కవి అందెశ్రీ జయంతి సందర్భంగా నేడు రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్‌లో సిఎం రేవంత్ రెడ్డి అందెశ్రీ స్మృతి వనం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “మాజీ సిఎం కేసీఆర్‌ మన ప్రజా గాయకుడు గద్దర్‌ని దారుణంగా అవమానించారు. అందెశ్రీ వంటి మన కవులను పట్టించుకోలేదు. ఆ అహంకారమే బీఆర్ఎస్‌ ప్రభుత్వ పతనానికి కారణం అయ్యింది. 

యస్! మా ప్రభుత్వం 70 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిందని మళ్ళీ నేను చెపుతున్నాను. బీఆర్ఎస్‌ పార్టీ నేతలు కావాలంటే సదరు ఉద్యోగుల ఇళ్ళకు వెళ్ళి వారి నియామకపత్రాలను పరిశీలించుకోవచ్చు. ఆ ఉద్యోగుల తల్లి తండ్రుల సాక్షిగా నేనీ మాట చెపుతున్నాను. 

తెలంగాణ ప్రజలు కల్వకుంట్ల కుటుంబానికి పదవి, అధికారం అన్నీ ఇచ్చి వారిని శ్రీమంతులని చేశారు. ప్రజలిచ్చిన ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ ఒక్కొక్కరు వందల ఎకరాలు సంపాదించుకొని ఫామ్‌హౌసులు నిర్మించుకున్నారు. కానీ మీరు తిరిగి ప్రజలకు ఏమిచ్చారు? రాష్ట్రంలో ఎవరైనా బాగుపడ్డారంటే అది మీ ఒక్క కుటుంబం... బీఆర్ఎస్‌ పార్టీ మాత్రమే. రాష్ట్రంలో మీ అంత ధనిక కుటుంబాలు మరొకటి ఉన్నాయా? అని సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.  

“అధికారంలో ఉన్నప్పుడు దొరల మాదిరిగా నిరంకుశంగా గడీ పాలన సాగించినందుకే ప్రజలు మిమ్మల్ని గద్దె దించారు. దాంతో ప్రజలు మిమ్మల్ని క్షమించేశారని భ్రమలో ఉన్నారు. కానీ నేను రాజకీయాలలో ఉన్నంత కాలం కల్వకుంట్ల కుటుంబాన్ని... బీఆర్ఎస్‌ పార్టీని అధికారంలోకి రానివ్వను. తెలంగాణ ప్రజలను దోచుకోనీయను,” అని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు.


Related Post