బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2019లో ఇంటర్ పరీక్షల నిర్వహణలో గ్లోబరీనా అనే ప్రైవేట్ సంస్థ అవకతవకలకు పాల్పడిందని, దాని వలన 27 మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారని ఇటీవల సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ఆ సంస్థ మాజీ మంత్రి కేటీఆర్ బినామీ సంస్థ అని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అదే సంస్థ పేరు మార్చుకొని కేంద్ర మంత్రి సాయంతో మళ్ళీ సిబీఎస్ఈ పరీక్షల నిర్వహణ కాంట్రాక్ట్ సంపాదించుకుందని, కానీ దానిలో కూడా అది అవకతవకలకు పాల్పడిందని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ఆయన ఆరోపణలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. గ్లోబరీనా సంస్థతో తనకు ఎటువంటి సంబంధం లేదని, సిఎం రేవంత్ రెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఖండించారు.
కనుక తక్షణమే ఆ వ్యాఖ్యలు వెనక్కు తీసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే తన లీగల్ టీమ్ సిఎం రేవంత్ రెడ్డికి లీగల్ నోటీస్ పంపిస్తుందని కేటీఆర్ హెచ్చరించారు.
కేటీఆర్ చేసిన ఈ హెచ్చరికపై సిఎం రేవంత్ రెడ్డి ఇంకా దీటుగా బదులిచ్చారు. గురువారం శాసనసభ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ, “గ్లోబరీనా ఖచ్చితంగా కేటీఆర్ బినామీ సంస్థే. అది అవకతవకలకు పాల్పడటం వలననే విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంటలిజన్స్ ఆ కేసు విచారణ జరుపుతోంది. నివేదిక వస్తే పూర్తి వివరాలు బయట పెడతా.
ఈ వ్యవహారంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటే కక్ష సాధింపు చర్యలని వాదిస్తారు. గ్లోబరీనాతో కేటీఆర్‌కి ఎటువంటి సంబంధం లేదంటే ఆయనే స్వయంగా ఆ సంస్థపై సిసిఎస్‌లో పిర్యాదు చేస్తే నేను పోలీసుల చేత విచారణ జరిపిస్తాను. గ్లోబరీనాపై పోలీసులకు పిర్యాదు చేసి కేటీఆర్ నిజాయితీ నిరూపించుకోవాలి. గ్లోబరీనా వ్యవహారంలో నేను కాదు ఆయనే అమరవీరుల స్థూపం వద్ద క్షమాపణలు చెప్పాలి,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
సిఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరూ ఈ వ్యవహరంపై చాలా నిర్దిష్టంగానే మాట్లాడారు. కనుక ఇద్దరిలో ఎవరి వాదన నిజమో తెలియాలంటే ఈ వ్యవహారంలో ఎవరో ఒకరు అడుగు ముందుకు వేయక తప్పదు. లేకుంటే ఇదొక రాజకీయ కాలక్షేపంగా మిగిలిపోతుంది.