ఎర్రవల్లిలో యుద్ధ వాతావరణం.. ఏం జరుగబోతోందో?

September 08, 2026


img

నేడు కొందరు మాజీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, వందలాది మంది కార్యకర్తలతో కలిసి కేసీఆర్‌ ఫామ్‌హౌసుని ముట్టడికి ప్రయత్నించడంతో, అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కానీ వందలాదిమంది పోలీసులను మొహరించి, ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి వారిని అడ్డుకున్నారు. ముఖ్యనేతలను అరెస్ట్ చేసి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

శాసనసభలో ఉన్న బీఆర్ఎస్‌ ముఖ్యనేతలు కేటీఆర్‌, హరీష్‌ రావు, జగదీశ్ రావు తదితరులు హుటాహుటిన కార్లలో ఫామ్‌హౌసుకు బయలుదేరారు. కానీ వారిని దారిలోనే పోలీసులు అడ్డుకోవడంతో, వారు పోలీస్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్‌ గూండాలకు పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చి ఫామ్‌హౌసు వద్దకు పంపించి, మా అధినేత ఇంటికి మేము వెళ్తుంటే మమ్మల్ని అడ్డుకుంటారా? కేసీఆర్‌ వంటిపై ఈగ వాలినా తెలంగాణ అగ్నిగుండమే అవుతుంది. కాంగ్రెస్‌ గూండాలను ఫామ్‌హౌసు వద్దకు ఎందుకు పంపించారు? మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు?” అంటూ బీఆర్ఎస్‌ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అయినా పోలీసులు వారిని ముందుకు వెళ్లేందుకు అనుమతించకపోవడంతో కార్లు దిగి నడుచుకుంటూ బయల్దేరారు. దాంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం మర్కూక్ వద్ద బీఆర్ఎస్‌ పార్టీ శ్రేణులు మొహరించి ఉండటంతో ప్రస్తుతం ఎర్రవల్లి ఫామ్‌హౌసు పరిసర ప్రాంతాలలో యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. 


Related Post