మితిమీరుతున్న ట్రాన్స్‌జెండర్ల ఆగడాలు.. కట్టడికి డీజీపీ ఆదేశం

September 06, 2026
img

సిఎం రేవంత్‌ రెడ్డి ట్రాన్స్‌జెండర్ల పట్ల మానవతా దృక్పదంతో వ్యవహరిస్తూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంటే రాష్ట్రంలో వారి ఆగడాలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపార సంస్థలను, శుభకార్యాల వద్ద  ట్రాన్స్‌జెండర్లు బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కూడా వారి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. వారిపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తుండటంతో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ వెంటనే స్పందించారు. 

రాష్ట్రంలోని అన్ని కమిషనరేట్ల పరిధిలో ఇలాంటి కార్యకలాపాలపై ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని పోలీస్ కమిషనర్లను ఆదేశించారు. గతంలో తాను హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా పనిచేసిన సమయంలోనూ ఇలాంటి ఫిర్యాదులు పెద్ద ఎత్తున వచ్చినప్పుడు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి వారిని కట్టడి చేశానని సీవీ ఆనంద్‌ తెలిపారు. కనుక ఇప్పుడు మళ్ళీ వారి ఆగడాలు పెరిగి ప్రజలను వేదిస్తున్నందున రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, ప్రజలను వేదిస్తున్న ట్రాన్స్‌జెండర్స్, వారి ముఠాలని ఉక్కుపాదం అణచివేస్తామని చెప్పారు. 

సిఎం రేవంత్‌ రెడ్డి ఆదేశం మేరకు ట్రాన్స్‌జెండర్లను సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడిపేందుకుగాను పోలీస్ శాఖ ఇప్పటికే కొందరికి ట్రాఫిక్‌ అసిస్టెంట్లుగా, హైడ్రా విధుల్లో అవకాశాలు కల్పించిందని, వారు ఎలాంటి ఫిర్యాదులు లేకుండా సమర్థంగా పనిచేస్తున్నారన్నారు. ప్రభుత్వం వారికి గౌరవప్రదమైన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నప్పటికీ.. కొందరు ఈవిధంగా చేస్తున్నారని, అటువంటి వారిని ఉపేక్షించేది లేదని డీజీపీ సీవీ ఆనంద్‌ హెచ్చరించారు.   

Related Post