గత కొంత కాలంగా ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో ప్రజలను భయపెట్టి భారీగా డబ్బులు దోచుకుంటున్న సైబర్ నేరగాళ్ళపై సీబీఐ కొరడా ఝుళిపించింది.
ఆపరేషన్ చక్ర-6లో భాగంగా దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలలో, 89 ప్రాంతాలలో సీబీఐ బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. తాజా సమాచారం ప్రకారం ఈ ముఠాలను నడిపిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి ఇళ్ళ నుంచి బ్యాంకింగ్ పత్రాలు, డిజిటల్ పరికరాలు సహా పలు ఆధారాలు సీబీఐ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఈ ముఠాలు తాము పోలీస్, ప్రభుత్వ అధికారులమంటూ వీడియో కాల్స్ చేస్తూ ప్రజలను భయపెట్టి, బెదిరించి డబ్బు గుంజుకుంటున్నారు. వీఋ మరీ రెచ్చిపోతుండటంతో సీబీఐ రంగంలో దిగి మూడు ప్రధాన కేసులను తీసుకొని దర్యాప్తు చేస్తోంది.
ఈ మూడు కేసుల్లో బాధితుల నుంచి మొత్తం రూ.42.36 కోట్లు కాజేసినట్లు గుర్తించింది. బిట్స్ పిలానీకి చెందిన ఓ బాధితుడి నుంచి రూ.7.67 కోట్లు, గుజరాత్‌లో ఓ వ్యక్తి నుంచి రూ.19.24 కోట్లు, కర్ణాటకలో ఓ వ్యక్తి నుంచి రూ.15.45 కోట్లు ఈవిధంగా దోచుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
మోసానికి గురైన డబ్బు ఎక్కడికి చేరింది? ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? అనే కోణంలో సీబీఐ దర్యాప్తు మొదలుపెట్టి బాధితుల బ్యాంకు ఖాతాలు, వారు చేసిన ఆన్‌లైన్ లావాదేవీలను విశ్లేషించిన తర్వాత ఒకేసారి దేశంలో 20 రాష్ట్రాలలో 89 ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది.
హర్యానాకు చెందిన ఆకాష్ అనే ముఠా సభ్యుడు తన ఖాతాలో రూ.1.95 కోట్లు జమ చేయించుకుని, దానిని అదే రోజున ఇతర ఖాతాలకు బదిలీ చేసినట్లు సీబీఐ గుర్తించింది. అదేవిధంగా కోల్‌కతాకు చెందిన రాజా కర్మాకర్ సంస్థ ఖాతాలో రూ.1.5 కోట్లు జమ అయినట్లు తేలింది.
ఆ సంస్థలో జ్యోతిరాణి అనే మహిళా తన ఖాతాలోకి వచ్చిన డబ్బులో నుంచి కొంత నగదు తీసుకుని, మిగిలిన మొత్తాన్ని ఇతర ఖాతాలకు బదిలీ చేసినట్లు సీబీఐ కనుగొంది. నిందితులు అందరినీ పట్టుకునే వరకు తమ దర్యాప్తు కొనసాగుతుందని సీబీఐ అధికారులు తెలిపారు.