మాజీ మంత్రి కొండా సురేఖకు బీఆర్ఎస్ పార్టీ ‘నో ఎంట్రీ’ బోర్డు పెట్టేసింది. మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు జగదీష్ రెడ్డి నిన్న పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “కొండా సురేఖతో మా పార్టీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారనే వార్తలు అబద్దం. ఆమెకు మా పార్టీలో చోటు లేదు. మా పార్టీని వీడిన కొందరు ఎమ్మెల్యేలు సైతం తిరిగి రావాలనుకుంటున్నారు. కానీ ఒకరిద్దరు మినహా మిగిలినవారికి బీఆర్ఎస్ పార్టీలో చోటు లేదు.
బీసీ మహిళా మంత్రి కొండా సురేఖని ఆవిధంగా తొలగించడం సబబు కాదు. ఆమె, ఆమె కుమార్తె సుస్మిత అడిగిన ప్రశ్నలకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పనేలేదు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరులు కూడా ఒకప్పుడు మా పార్టీలో చేరాలనుకున్నారు. కానీ తీసుకోలేదు. వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత మూడేళ్ళుగా నిత్యం సిఎం రేవంత్ రెడ్డిని బెదిరిస్తూనే ఉన్నారు. అలాగే పలువురు రేవంత్ రెడ్డి తీరుని తప్పు పడుతూనే ఉన్నారు. కానీ వారిపై చర్యలు తీసుకునేందుకు రేవంత్ రెడ్డికి ధైర్యం లేదు. బీసీ మహిళా మంత్రి కొండా సురేఖపై వెంటనే వేటు వేశారు. రేవంత్ రెడ్డి వెయ్యి రోజుల పాలనలో చేసిన ఘన కార్యం ఇదొక్కటే,” అని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు.
సిఎం రేవంత్ రెడ్డి ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు కనుసన్నలలో పనిచేస్తున్నారని, తెలంగాణ నీటిని ఆంధ్రాకు పారిస్తూ ఆంధ్రా ప్రయోజనాలు కాపాడుతున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు.