కాంగ్రెస్‌లో కొండా ఉంటారా.. బయటకు వెళ్తారా?

September 04, 2026


img

వరంగల్‌ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్‌టాపిక్‌. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించిన తర్వాత మొదలైన రాజకీయ వేడి.. ఇప్పుడు కొండా దంపతుల భవిష్య రాజకీయ కార్యాచరణపై సస్పెన్స్‌గా మారింది.

నన్ను అన్యాయంగా పదవి నుంచి తొలగించినప్పటికీ.. నేను కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటా. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయను. శాసనసభ సమావేశాలకు కూడా హాజరవుతానని కొండా సురేఖ స్పష్టం చేశారు. కానీ కొన్ని గంటల వ్యవధిలోనే ఒకవైపు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్‌ నేతలు కొండా దంపతులను తమ పార్టీలోకి రప్పించేందుకు మంతనాలు జరుపుతున్నట్లు ప్రచారం మొదలైంది.

కొండా దంపతులు గతంలో బీఆర్ఎస్‌ నుంచి బయటకు వచ్చారు. దీంతో ఈసారి వారు బీజేపీలో చేరవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తమకు తగిన రాజకీయ ప్రాధాన్యతతో పాటు వచ్చే ఎన్నికల్లో రెండు టికెట్లకు హామీ ఇచ్చే పార్టీ వైపే వారు మొగ్గు చూపే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

ఈ విషయంలో బీజేపీలో కొండా దంపతులకు అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ.. బీఆర్ఎస్‌లో ఆ అవకాశం అంతగా కనిపించడం లేదు. దీంతో వారి తదుపరి రాజకీయ అడుగు బీజేపీ వైపే ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ప్రస్తుతం కొండా సురేఖ కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టంగా చెబుతున్నారు. మరి ఆ మాటకే కట్టుబడి ఉంటారా? లేక రాజకీయ పరిణామాలు మరో నిర్ణయం తీసుకునేలా చేస్తాయా? అనేది త్వరలోనే తేలనుంది.


Related Post