సోమవారం నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగా, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు శాసనసభ బయట చేసిన హడావుడితో తొలిరోజునే అధికార, విపక్షాల మద్య తీవ్ర రాజకీయ వేడి సృష్టించాయి.
‘హామీల అమలులో కాంగ్రెస్ విఫలం.. వెయ్యిరోజుల పాలన విఫలం,’ అని ముద్రించి ఉన్న నల్ల చొక్కాలు ధరించి బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు శాసనసభలో ప్రవేశించబోతే పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారికీ పోలీసులకు మద్య తోపులాటలు జరిగాయి. కొందరికి స్వల్పగాయాలయ్యాయి. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ని ఉద్దేశ్యించి అనుచిత వ్యాఖ్యలు చేశారు.
శాసనసభలో వారి తీరుపై సిఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా స్పీకర్‌ని ఉద్దేశ్యించి తాత మధు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇది యావత్ తెలంగాణ ప్రజలను అవమానించినట్లేనని ఆయన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ని కోరారు.
అనంతరం పోలీసులు తాత మధుపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఆయనను ఇంటి నుంచి అరెస్ట్ చేసి నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
నేడు మరికొద్ది సేపటిలో రెండో రోజు శాసనసభ సమావేశాలు జరుగబోతున్నాయి. తొలిరోజే ఇంత హడావుడి చేసిన బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఇవాళ్ళ ఎలాంటి వ్యూహంతో వస్తారో? ఏం చేస్తారో?