తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. కారణం ఏమిటంటే, 2019 ఇంటర్ పరీక్షలలో కేటీఆర్ బినామీ సంస్థ గ్లోబరీనా అవకతవకలకు పాల్పడటం వలననే 25 మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారని సిఎం రేవంత్ రెడ్డి కొడంగల్ సభలో ఆరోపించారు.
ఆ తర్వాత అదే సంస్థ పేరు మార్చుకొని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సాయంతో సిబీఎస్ఈ ప్రశ్నాపత్రాలు మూల్యాంకనం చేసే కాంట్రాక్ట్ సంపాదించుకొని మళ్ళీ అవకతవకలకు పాల్పడిందని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ఈ ఆరోపణలపై కేటీఆర్ తీవ్రం స్పందించారు. తనపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసినందుకు సిఎం రేవంత్ రెడ్డి తక్షణం వాటిని ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే త్వరలోనే తన లీగల్ టీమ్ ఆయనకు లీగల్ నోటీస్ పంపిస్తుందని హెచ్చరించారు.
కనీసం ఒక్కసారైనా ముఖ్యమంత్రిలా హుందాగా వ్యవహరించాలని కేటీఆర్ హితవు పలికారు. ఎన్నికల హామీలు, ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ప్రతిపక్షాలపై వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదని ఆయన అన్నారు.