తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద నిత్యపూజలు అందుకునే ఆంజనేయస్వామి విగ్రహాన్ని చోరీ అయ్యింది. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యంలో తెల్లవారుజాము సుమారు 3 గంటలకు కాకీ దుస్తులు ధరించిన ఓ వ్యక్తి విగ్రహాన్ని గోనె సంచీలో పెట్టుకొని వెళ్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
నిత్యపూజలు అందుకునే ఆంజనేయస్వామి విగ్రహం మాయం అవడంతో భక్తులు మొదట దిగ్బ్రాంతి చెందారు. ఆ తర్వాత టిటిడీపై విరుచుకుపడ్డారు. నిత్యం వేలాదిమంది తిరిగే ఆ మార్గంలో ఓ వ్యక్తి స్వామివారి విగ్రహం దొంగతనం చేయడం టిటిడీ నిర్లక్ష్యమే భద్రతా వైఫల్యమేనని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టిటిడీ పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితుడుని గుర్తించి అతని కోసం గాలింపు మొదలుపెట్టారు.
కోట్లాది మంది భక్తులు పరమ పవిత్రమైన స్వామివారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించిన కేసు, పరకామణిలో విదేశీ కరెన్సీ దొంగతనం కేసు, స్వామివారి పట్టువస్త్రాల కొనుగోలు కుంభకోణం కేసు వంటివి ఓ అరడజను కేసుల విచారణ నత్తనడకన సాగుతూనే ఉన్నాయి. కానీ ఎవరినీ దోషిగా నిరూపించలేకపోతున్నారు. కనుక ఎవరిపై చర్యలు తీసుకోలేకపోతున్నారు.
ఇటువంటి పరిస్థితి నెలకొని ఉన్నప్పుడు ఎవరైనా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతూనే ఉంటారు. కనుక ఈ కేసు కూడా వాటిలో ఒకటిగా మిగిలిపోతుందేమో?