దేశంలో మహిళల భద్రత ఎప్పుడూ ప్రశ్నార్ధకంగానే ఉంటోంది. ఇందుకు తాజా ఉదాహరణ శంషాబాద్ వద్ద ఓ మహిళా ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం చేయడమే.
ఇండిగో ఎయిర్ లైన్స్‌లో పని చేస్తున్న ఆమె రోజూలాగే మంగళవారం రాత్రి క్యాబ్ బుక్ చేసుకొని విమానాశ్రయయానికి బయలుదేరారు. విమానాశ్రయానికి కొంత దూరంలో నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశం వద్ద కారు ఆపడంతో ఆమె డ్రైవర్‌ని ఎందుకు ఆపావని నిలదీశారు.
యూరిన్ కోసమని చెప్పి కిందకు దిగిన అతను, హటాత్తుగా వెనుక డోర్ తీసుకొని ఆమెపై అత్యాచారం చేయబోయాడు. కానీ ఆమె గట్టిగా అరుస్తూ తీవ్రంగా ప్రతిఘటించడంతో అతను భయపడి కారు వదిలిపెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు.
ఆమె పోలీసులకు ఫోన్ చేయడంతో వారు హుటాహుటిన అక్కడకు చేరుకొని, ఆమె చెప్పిన వివరాలు, కారు నంబెర్ ప్లేట్ తదితర ఆధారాలతో క్యాబ్ డ్రైవర్ కోసం గాలింపు మొదలుపెట్టారు.
నగరంలో వందల కొద్దీ పరిశ్రమలు, ఐటి కంపెనీలున్నందున వేలాది మంది మహిళలు నైట్ డ్యూటీలు చేస్తుంటారు. లేదా డ్యూటీ ముగించుకొని రాత్రి పూట ఒంటరిగా ఇళ్ళకు తిరిగి వెళ్తుంటారు.
ఇలాంటి ఘటనలు నైట్ డ్యూటీలు చేసే మహిళలలో తీవ్ర అభద్రతాభావం కలిగిస్తాయనే వేరేగా చెప్పక్కరలేదు.