జూలై 24న తెలంగాణలో విద్యాసంస్థలు బంద్!

July 22, 2026
img

నీట్ ప్రశ్నా పత్రాల లీకేజీలు, అవకతవకలపై ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో జూలై 24న తెలంగాణలో కూడా విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. 

ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్‌ఎస్‌యూఐ, పీడీఎస్‌యూ, ఏఐఎఫ్‌డీఎస్, ఏఐఎస్‌బీ, ఏఐపీఎస్‌యూ తదితర విద్యార్థి సంఘాలు ఈ బంద్‌లో పాల్గొననున్నట్లు ప్రకటించాయి.

హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు బంద్ వివరాలను వెల్లడించారు.

నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, దేశ విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడిందని వారు ఆరోపించారు. 

ఈ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా పరీక్షల నిర్వహణలో విఫలమైనందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)ను కూడా రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు కోరాయి. 

దేశంలోని విద్యా వ్యవస్థ స్వయంప్రతిపత్తికి భంగం కలిగించే ‘వీసీబీఎస్‌ఏ బిల్లు’ను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. 

ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళనలు నిర్వహిస్తున్న విద్యార్థులు, యువతపై జరిగిన పోలీసు దాడులపై పారదర్శక విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశాయి.

జూలై 24న జరిగే విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థల యాజమాన్యాలు, తల్లిదండ్రులు, మేధావులు సంపూర్ణ మద్దతు ఇచ్చి విజయవంతం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు.

Related Post