జగిత్యాలలో ఆర్టీసీ బస్సు చోరీ..

July 22, 2026


img

ఇప్పటి వరకు బైకులు, స్కూటీలు, కార్ల దొంగతనాల గురించే విన్నాము. ఇప్పుడు ఆర్టీసీ బస్సుల దొంగతనాల గురించి వింటున్నాము. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల బస్టాండ్‌లో నిలిపి ఉన్న ఆర్టీసీ బస్సుని ఓ వ్యక్తి ఎత్తుకెళ్ళాడు. డ్రైవర్ ప్రవీణ్ బస్సుని 8వ నం. ప్లాట్‌ఫాంపై నిలిపి కండక్టర్‌తో కలిసి ఛాయ్ తాగేందుకు వెళ్ళారు. ఆ సమయంలో ఓ వ్యక్తి డ్రైవర్ సీటులోకి వచ్చి బస్సుని స్టార్ట్ చేసి ఎత్తుకుపోయాడు. 

డ్రైవర్, కండక్టర్‌ తిరిగి వచ్చి చూసేసరికి ప్లాట్‌ఫాంపై బస్సు లేకపోయేసరికి పై అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

సీసీ ఫుటేజ్ ఆధారంగా బస్సు కోరుట్ల నుంచి నిజామాబాద్‌ రోడ్డులో వెళ్ళినట్లు గుర్తించిన పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. 

బస్సుని దొంగిలించిన వ్యక్తికి దానిని నడపడం చాతకాకపోవడంతో దారిలో మూడు దిచక్ర వాహనాలను ఢీకొట్టాడు. బస్సు కోసం గాలిస్తున్న పోలీసులకు ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన వాహనదారులు బస్సు ఎటు వైపు వెళుతోందో చెప్పారు. 

పోలీసులు దాదాపు 18కిమీ దూరం బస్సుని వెంబడించారు. కానీ వారిని చూసిన ఆ దొంగ బస్సుతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టించి ముందుకు సాగిపోయాడు. 

దీంతో పోలీసులు ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించడంతో వారు మెట్‌పల్లి పరిధిలోని గండి హనుమాన్‌ దేవాలయం సమీపంలో జాతీయ రహదారిపై భారీ వాహనాలను అడ్డంగా నిలిపారు. 

బస్సుని దొంగిలించిన వ్యక్తి వాటి నుంచి తప్పించుకునే అవకాశం లేకపోవడం హటాత్తుగా పక్కకు తిప్పాడు. దాంతో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టుని ఢీకొని నిలిచిపోయింది. ఇబ్రహీంపట్నం పోలీసులు వెంటనే అతనిని అదుపులోకి తీసుకున్నారు. 

అతను మద్యం మత్తులో బస్సు దొంగతనం చేశాడా లేక మతిస్థిమితం లేని కారణంగా చేశాడా? లేక బస్సుని దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతోనే చేశాడా?అనేది ఇంకా తేలియాల్సి ఉంది. 


Related Post