హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న మహిళా ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ ఆయన పిటిషన్ వేశారు.
మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిపై వివిధ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. అయన సోమవారం హైదరాబాద్‌లో తన బంధువుల ఇంటికి వెళ్ళి అక్కడ బాత్రూం క్లీనింగ్ లిక్విడ్ త్రాగి ఆత్మహత్యాయత్నం చేశారు. కానీ కుటుంబ సభ్యులు సకాలంలో ఆస్పత్రిలో చేర్చడంతో వైద్యులు ఆయన ప్రాణాలు కాపాడారు. అయితే పోలీసులు నమోదు చేసిన కేసు అలాగే ఉంది. కోలుకోగానే విచారణకు పిలిచి వివరణ సంతృప్తికరంగా లేనట్లయితే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కనుక అయన హైకోర్టుని ఆశ్రయించి, తనపై తప్పుడు ఆరోపణలతో అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుని కొట్టివేయాలని కోరారు. న్యాయస్థానం ఆయన పిటిషన్ విచారణకు స్వీకరించింది.
మరోవైపు పోలీసులు ఈ కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. నేడోరేపో ఉదయ్ కృష్ణారెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉంది. ఇది తీవ్ర నేరారోపణతో నమోదైన కేసు కనుక ముందుగా పోలీసుల విచారణకు హాజరవ్వాలని న్యాయస్థానం ఆదేశించే అవకాశం ఉంది. నిజానిజాలు తేలకుండా ఆయనని అరెస్ట్ చేయవద్దని ఆదేశించవచ్చు తప్ప ఆయన కోరినట్లు పోలీస్ కేసుని కొట్టివేసే అవకాశం ఉండకపోవచ్చు.