కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

July 21, 2026
img

తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం శ్రీ కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఓ శుభవార్త. సిద్ధిపేట జిల్లా కొమురవెల్లిలో నిర్మించిన 'కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్’ జూలై 26న ప్రారంభం కానుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రకటించారు.

సిద్ధిపేట జిల్లా కేంద్రానికి సుమారు 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొమురవెల్లి మల్లన్న ఆలయానికి తెలంగాణ నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. 

కనుక మల్లన్న భక్తుల సౌకర్యార్ధం ఆలయానికి సమీపంలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి చొరవ తీసుకుని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో చర్చించి రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయించారు. 2024లో కిషన్ రెడ్డి స్వయంగా భూమిపూజ చేసి స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభించారు. 

రూ.5.63 కోట్ల వ్యయంతో ఆధునిక సౌకర్యాలతో ఈ స్టేషన్‌ నిర్మించారు. పనులు పూర్తవడంతో వాటి ఫోటోలను కిషన్ రెడ్డి సోషల్ మీడియాలో పంచుకున్నారు.

కనుక ఇకపై సికింద్రాబాద్ నుంచి కొమురవెల్లి పుణ్యక్షేత్రానికి భక్తులు మరింత సులభంగా చేరుకునే అవకాశం కలుగుతుంది. అలాగే కొమురవెల్లి పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఈ స్టేషన్ నుంచే సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ చేరుకోగలుగుతారు. 

Related Post