తమిళనాడు సిఎం జోసఫ్ విజయ్ చివరిగా నటించిన ‘జన నాయగన్’ (తెలుగులో జన నాయకుడు) అనేక సమస్యలు అధిగమించి రేపు (జూలై 23న) ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
అయితే జనవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమా ఏడూ నెలల ఆలస్యంగా విడుదలవుతుండటం, ఇప్పటికే ఆ సినిమా లీక్ అవడంతో సుమారు కోటిన్నర మంది చూసేయడం ఆ సినిమాపై ఎంతో కొంత ప్రభావం చూపవచ్చనిపిస్తోంది.
దీనికి తోడూ ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు బాలకృష్ణ, శ్రీలీల ప్రధానపాత్రలు చేసిన ‘భగవంత్ కేసరి’కి కాపీగా కనిపిస్తుండటం తమిళ ‘జన నాయగన్’పై అంతగా ప్రభావం చూపకపోయినా తెలుగులో ‘జన నాయకుడు’పై తీవ్ర ప్రభావం చూపవచ్చు.
కానీ ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమా ‘భగవంత్ కేసరి’కి కాపీ కాదని స్పష్టం చేశారు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను స్పూర్తిగా తీసుకొని విజయ్ దళపతి ఇమేజ్‌కి తగ్గట్లు రూపొందించారని అనిల్ రావిపూడి అన్నారు. కనుక తెలుగులో కూడా ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
హెచ్.వినోద్ దర్శకత్వంలో 'జన నాయకన్'ని కెవిఎన్ ప్రొడక్షన్స్ చాలా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించింది. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా పూజా హెగ్డే నటించగా, బాబీ డియోల్ విలన్‌గా నటించారు. ప్రకాశ్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మమిత బైజు, ప్రియమణి, నరేన్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.