తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో నేడు మంత్రులు, సీనియర్ నేతలు ‘ఛలో లోక్ భవన్’ ముట్టడి కార్యక్రమం నిర్వహించడమే విచిత్రమనుకుంటే, వారిని పోలీసులు అడ్డుకోవడం, అరెస్ట్ చేయడం మరో విచిత్రం.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు ప్రధాని మోడీ నివాసం ఎదుట ధర్నా చేసిన సంగతి తెలిసిందే.
కనుక దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు తమ అధిష్టానం అడుగు జాడలలో నడుస్తూ ఎక్కడికక్కడ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ కూడా నేడు ఆందోళన చేపట్టింది.
ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అజరుద్దీన్ పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి తరలివెళ్తున్న మంత్రులు, కాంగ్రెస్ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొన్నిచోట్ల కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నేతలు తమ తమ జిల్లాలు, నియోజకవర్గాలలో ఆందోళనలు నిర్వహించగా అక్కడ ఇంచుమించు ఇటువంటి పరిస్థితే నెలకొంది.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తప్పనిసరిగా రాజీనామా చేయాలని లేకుంటే తమ ఆందోళన మరింత ఉదృతం చేస్తామని డెప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అన్నారు.