కార్గిల్ యుద్ధం నేపధ్యంతో ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చాయి. తాజాగా ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ వెబ్ సిరీస్ కూడా రాబోతోంది. ఓనీ విశ్వక్ సేన్ దర్శకత్వంలో అభిజిత్ సింగ్ ఫార్మర్, కుశాల్ శ్రీవాత్సవ కలిసి నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ఆగస్ట్ 7 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రసారం కాబోతోంది.
ఈ వెబ్ సిరీస్‌లో సిద్ధార్థ్ స్క్వాడ్రన్ లీడర్ అజయ్ ఆహుజగా నటించారు. జిమ్మీ షెర్గిల్, అభయ్ వర్మ, దియా మీర్జా తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ సోమవారం విడుదల చేశారు.
దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పాకిస్తాన్‌తో స్నేహ సంబంధాలు బలపరుచుకోవాలని సదుదేశ్యంతో 1999, ఫిబ్రవరి 19న లాహోర్‌కి బస్సుయాత్ర చేశారు.
భారత ప్రధాని పాకిస్తాన్‌కు బస్సుయాత్ర చేయడం కేవలం స్నేహపూర్వకమైనది మాత్రమే కాదు అత్యంత సాహసోపేతమైనది కూడా. ఇరుగు పొరుగు దేశాలతో భారత్ ఎల్లప్పుడూ స్నేహసంబంధాలే కోరుకుంటుందని నిరూపించేందుకు అదొక గొప్ప ప్రతీకగా నిలిచింది.
కానీ పాకిస్తాన్ పాలకులు మరోసారి తమ దుర్బుద్ధి బయటపెట్టుకున్నారు. సరిగ్గా మూడు నెలల తర్వాత అంటే 1999, మే నెలలో కీలకమైన కార్గిల్ పర్వతశ్రేణులను ఆక్రమించుకున్నారు. అప్పుడు భారత్ ఆర్మీ, వాయుసేన కలిసి పర్వత శ్రేణులలో తిష్ట వేసిన పాక్ ఉగ్రవాదులను, వారికి అండగా నిలిచిన పాక్ ఆర్మీపై భీకర దాడులు చేసి మళ్ళీ కార్గిల్ పర్వత శ్రేణులకు స్వాధీనం చేసుకున్నారు. దీనిలో వాయుసేనకు చెందిన ‘గోల్డెన్ ఏరోస్’ బృందం కీలకపాత్ర వహించింది.
యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఈ కార్గిల్ వార్ స్పూర్తితో అనేక సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ మరోసారి నాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపబోతోంది.