తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో పర్యటించి జడ్చర్ల సమీపంలోని గంగాపూర్ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మరో కొత్త శపథం చేశారు. “2029 ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం. ఈ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కనీయం,” అని శపథం చేశారు.
అందరు ముఖ్యమంత్రులు, అన్ని పార్టీల నాయకులు ఇలాగే మాట్లాడుతుంటారని సిఎం రేవంత్ రెడ్డి శపధాలను తేలికగా కొట్టి పడేయడానికి లేదు. గత ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని ఎట్టి పరిస్థితులలో గెలవనీయనని శపథం చేశారు. ఆ పార్టీని ఓడించారు. లోక్‌సభ ఎన్నికలలో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కనీయనని శపథం చేశారు. దక్కనీయలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీని ఓడిస్తామని శపథం చేశారు. ఓడించారు.
ఇదివరకు కేసీఆర్‌ని మించిన ఎన్నికల వ్యూహ నిపుణుడు రాష్ట్రంలో మరొకరు లేరని, ఆయనని, బీఆర్ఎస్ పార్టీని ఓడించే మొనగాడు పుట్టలేదని అందరూ అనుకునేవారు.
ఎన్నికల సమయంలో కేసీఆర్ సిఎంగా ఉన్నారు. కనుక ప్రభుత్వ, పోలీస్ అధికార యంత్రాంగం మొత్తం ఆయన చేతిలోనే ఉండేది. మరోపక్క సుశిక్షితులైన సైన్యం వంటి గులాబీ దళాలు గ్రామగ్రామాన్న బలంగా ఉన్నాయి.
అదే సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడుగా పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని పార్టీలో సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకించేవారు. పైగా పార్టీలో సీనియర్లు పదవులు, టికెట్ల కోసం కీచులాడుకుంటూ గ్రూపులు కట్టేవారు.
కనుక ఏవిధంగా చూసినా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని ఓడించే పరిస్థితి లేనేలేదు. కానీ అలాంటి పరిస్థితులలోనే ఓడించి చూపారు. వచ్చే ఎన్నికల నాటికి ఆయనే సిఎంగా ఉంటారు. కనుక రేవంత్ రెడ్డి మరింత శక్తివంతంగా ఉన్నారని అర్ధమవుతూనే ఉంది. కనుక ఆయన శపధాలను లైట్ తీసుకొని ఎదురుదాడి చేస్తే చాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఆయన చేతిలో మరోసారి ఓటమి తప్పదు.