కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు మధ్యాహ్నం రాజీనామా చేశారు.తన రాజీనామా లేఖను ప్రధాని మోడీకి పంపించారు. నీట్ ఆందోళనలు, రాజీనామా చేయాలనే సీజేపీ, విద్యార్ధులు, ప్రతిపక్షాల ఒత్తిడి కారణంగా బిజేపి పెద్దల సూచన మేరకు ఆయన రాజీనామా చేసి ఉండవచ్చు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగంతో స్పందించారు.
“నీట్ వివాదంపై జరుగుతున్న పరిణామాలు, నా రాజీనామా కోసం ఆందోళనలు చూస్తున్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. నాలుగు దశాబ్దాలుగా నేను ఉపాధ్యాయులు, విద్యాసంస్కరణల కోసం పని చేశాను. ఎందుకంటే విద్య ద్వారానే యువత, వారితోనే దేశం బాగుపడుతుందని గట్టిగా నమ్మాను కనుక.
నీట్ ప్రశ్నాపత్రాలు లీక్ కాగానే వెంటనే స్పందించి దర్యాప్తు జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకున్నాము. సీబీఐ విచారణకు ఆదేశించాను. మళ్ళీ వెంటనే నీట్ పరీక్ష విజయవంతంగా నిర్వహించాము. నేనెన్నడూ నా బాధ్యతల నుంచి తప్పించుకోవాలని అనుకోలేదు. అందుకే జరిగిన పొరపాట్లను వెంటనే సరిదిద్దే ప్రయత్నాలు చేశాను.
కానీ ఈ ఆందోళనల వలన యువత భవిష్యత్ దెబ్బ తింటుంది. దేశానికి ఇప్పుడు యువశక్తి చాలా అవసరం. కనుక వారి ఈ కోరికని గౌరవించి రాజీనామా చేస్తున్నాను. యువత రాజకీయాలలో చిక్కుకోకుండా చదువులపై శ్రద్ధ పెట్టాలి. మంత్రిగా దేశానికి సేవ చేసేందుకు నాకు అవకాశం కల్పించిన ప్రధాని మోడీకి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను,” అని అన్నారు.