అందుకు సంతోషించాలి కానీ కన్నీళ్ళు దేనికి?

July 24, 2026


img

విజయ్ దళపతి వంటి పెద్ద హీరో చివరి సినిమా ‘జన నాయగన్’లో నటించే అవకాశం దక్కడం తన కెరీర్‌లో పెద్ద మైలురాయిగా భావించిన టీవీ నటి ఆనంది, సినిమా విడుదలయ్యాక చూస్తే దానిలో తాను నటించిన సన్నివేశాలను తొలగించడంతో తీవ్ర భావోద్వేగంతో కన్నీళ్ళు పెట్టుకున్నారు. తన మనసులో బాధని ఆమె వీడియో సందేశం ద్వారా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ వీడియో వైరల్‌గా మారింది. 

“విజయ్‌తో కలిసి నటించాలనే నా కల నెరవేరిందని చాలా సంతోషించాను. నేను ఈ సినిమా కోసం ఏడాదిన్నరగా ఎదురుచూశాను. కానీ ఆ సినిమాలో నేను చేసిన సన్నివేశాలను పూర్తిగా తొలగించడంతో ఆ కల కూడా నెరవేరలేదు. 

విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పేసి రాజకీయాలలోకి వెళ్ళిపోయారు కనుక ఇక ఎన్నటికీ ఇక ఆయనతో కలిసి నటించే అవకాశం కూడా రాదు. ఒక సంవత్సరం పాటు చేసిన నా శ్రమ, ఎదురుచూపులు వృథా అయ్యాయి,” అంటూ ఆమె కన్నీళ్ళు పెట్టుకున్నారు. 

ఎడిటింగ్ సమయంలో కథ నిడివి, స్క్రీన్‌ప్లే అవసరాల దృష్ట్యా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సాధారణమే. కానీ  ఒక నటుడి శ్రమ మొత్తం తెరపై కనిపించకపోవడం కూడా బాధాకరమే. కనుక ఆమె ఆవేదనని అర్థం చేసుకోవచ్చు. 

కానీ జన నాయగన్ సినిమాకి మొదటి రోజు నుంచే నెగెటివ్ టాక్ వస్తున్నప్పుడు, ఈ సినిమా ఇంకా ఆడుతుందో లేదో తెలీని పరిస్థితి నెలకొన్నప్పుడు, అలాంటి సినిమాలో తాను కనపడనందుకు ఆనందీ ఆనందించాలి కానీ బాధ పడటం కన్నీళ్ళు పెట్టుకోవడం దేనికి? 

ఒకవేళ ఈ సినిమా ఫ్లాప్ అని తేలిపోతే, ఆమెపై కూడా ఈ ముద్ర పడుతుంది కదా?ఒకసారి అలాంటి ముద్ర పడితే సినీ పరిశ్రమ ఏవిధంగా ట్రీట్ చేస్తుందో ఆమెకీ బాగా తెలుసు. కనుక అలాంటి ప్రమాదం నుంచి కూడా తప్పించుకునందుకు సంతోషించాలి కానీ కన్నీళ్ళు దేనికి తల్లీ? 



Related Post

సినిమా స‌మీక్ష