నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలపై ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తనదైన శైలిలో స్పందించారు.
నీట్ పేపర్ లీక్‌కి బాధ్యతా వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా, ఈ లీక్ వలన ఆత్మహత్య చేసుకున్న పిల్లల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లింపు, మళ్ళీ ఇలాంటివి జరుగకుండా ఒక గట్టి భరోసా... ఏ ప్రభుత్వమైనా అడగకుండా చేయాల్సిన పనులు ఇవి. ఈ చిన్న డిమాండ్లు సాధించుకోవడానికి లక్షల మంది పిల్లలు లాఠీ దెబ్బలు తిని రక్తమోడుస్తున్నారు!
తిండితిప్పలు మాని దెబ్బలకి ఓర్చుకొని రాత్రనకా పగలనకా ఉద్యమిస్తున్నారు. పిల్లలు జవాబుదారీతనం అడుగుతున్నారు. ఇందులో న్యాయం ఉంది. ప్రభుత్వం వాళ్ళ మాట వినాలి. వాళ్లకి భరోసా ఇవ్వాలి. వాళ్ళ స్పూర్తిని గెలిపించాలి. మన పిల్లలు గెలిస్తే దేశం గెలిచినట్లు. మన పిల్లలు గెలిస్తే మనం బ్రతికినట్లు.
నిజానికి ప్రజలు గెలిస్తేనే ప్రభుత్వాలు గెలిచినట్లు. ప్రియమైన జెన్-జీ మీరు చేస్తున్న ఈ పోరాటానికి చేతులెత్తి దణ్ణం పెడుతున్నాను,” అంటూ భావోద్వేగంతో తన అభిప్రాయం చెప్పారు.
దిల్లీలో మొదలైన ఈ ఆందోళనలు దేశమంతటా వ్యాపిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రతినిధులతో చర్చలు మొదలు పెట్టింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప మిగిలిన రెండు డిమాండ్లపై సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.