హైదరాబాద్‌లో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగినందున చాలామంది జీవన ప్రమాణాలు పెరిగాయి. కనుక ఆవిధంగా మరో స్థాయికి చేరుకున్న ధనవంతుల జీవితాలు ఏవిధంగా ఉంటాయి?అనే ఆలోచనతో తీసిన సినిమాయే ‘అమీర్ లోగ్’.
రమణారెడ్డి సోమ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమాలో హరి, మనోజ్, శశిధర్, వేద జలంధర్ ప్రధాన పాత్రలు చేశారు. పవోన్ రమేష్, విశ్వేన్దర్ రెడ్డి, సయోగి తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో దర్శకనిర్మాత రమణారెడ్డి మాట్లాడుతూ, “హైదరాబాద్‌లో అమీర్ లోగ్ జీవితాలలో డబ్బు, సంతోషాలు ఏవిధంగా ప్రభావితం చేస్తుంటాయనే విషయాన్ని తాత్వికతతో చెప్పే ప్రయత్నమే ఇది. హైదరాబాదీల పట్ల మరింత ప్రేమ, గౌరవం పెంచేలా ఉంటుందీ సినిమా. మన చుట్టూ ఉండే సమాజంలో ఒక వర్గం జీవన విధానం ఏవిధంగా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు చూపే ఈ సినిమాతో ప్రతీ ఒక్కరూ కనెక్ట్ అవుతారని భావిస్తున్నాను,” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో అమీర్ లోగ్ నుంచి ‘అవ్వల్ దావత్’ అంటూ సాగే పాట విడుదల చేశారు. మనోజ్ కుమార్ జూలూరి వ్రాసిన ఈ పాటకి స్మరణ్ సాయి సంగీతం అదించగా, రాహుల్ సిప్లిగంజ్ బృందం హుషారుగా పాడారు.
అవ్వల్ నంబర్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రమణ రెడ్డి సోమ, మాధవి రెడ్డి సోమ, మనోహర్ రెడ్డి మంచూరి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు పాటలు: మనోజ్ కుమార్ జూలూరి; సంగీతం: స్మరణ్ సాయి; కెమెరా: ఎస్‌వీకే, ఎడిటింగ్: రోహిత్ పెనుమత్స; కోరియోగ్రఫీ: అనీ మాస్టర్ చేస్తున్నారు. ప్రముఖ నటుడు దగ్గుబాటి రానాకి చెందిన స్పిరిట్ మీడియా ద్వారా ‘అమీర్ లోగ్’ ఆగస్ట్ 21న విడుదల కాబోతోంది.