భారత కరెన్సీ విషయంలో నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయులు, నేపాల్ పౌరులు రూ.200, రూ.500 విలువైన భారత కరెన్సీ నోట్లను నేపాల్‌లో ఉపయోగించేందుకు అనుమతి ఇచ్చింది. కానీ గరిష్ఠంగా రూ.25,000 వరకే అనుమతిస్తున్నట్లు తెలిపింది.
అయితే ఈ నిబంధన 2016 నవంబర్ 9వ తేదీ లేదా ఆ తర్వాత జారీ చేసిన రూ.200, రూ.500 నోట్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ మేరకు నేపాల్ రాష్ట్రీయ బ్యాంక్ (NRB) తాజాగా స్పష్టత ఇచ్చింది.
భారత్‌లో 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత నేపాల్‌లో రూ.100 నోట్లను మాత్రమే అనుమతించింది. అప్పటి నుంచి రూ.200, రూ.500 నోట్ల వినియోగంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. దాదాపు పదేళ్ళ తర్వాత ఈ నిబంధనలను సడలించడం ద్వారా భారత్-నేపాల్ మధ్య ప్రయాణాలు, చిన్న వ్యాపార లావాదేవీలు మరింత సులభం కానున్నాయి.
ముఖ్యంగా భారతీయ పర్యాటకులకు వారి వలన లబ్ది పొందుతున్న నేపాల్లోని వర్తకులు, హోటల్స్, పర్యాటక రంగంలో ఉన్నవారికీ ఇది చాలా ఉపశమనం కలిగిస్తుంది.