వీళ్ళు సమాజానికి మహాలక్ష్ములే

June 07, 2026


img

నాడు కేసీఆర్‌ హయంలో బతుకమ్మ చీరల పధకంతో పండుగ ముందు నిరుపేద మహిళలకు రెండు చీరలు అందించేవారు. ఈ చీరలు నేసే బాధ్యత రాష్ట్రంలోని చేనేత, మరమగ్గం పని వారికి అప్పగించడంతో వారికి ఏడాది పొడవునా పని, ఆదాయం లభించేది. 

ఇటువంటి విజయవంతమైన చక్కటి పథకమే కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి. అంటే ఇది బస్సులలో ఉచిత ప్రయాణం గురించి కాదు. రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయిలోని మహిళా సమాఖ్యలను ఆర్టీసీ బస్సుల యజమానులుగా మార్చడం.

దీని కోసం ప్రభుత్వం ఒక్కో సమాఖ్యకు రూ.30 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తుంది. సమాఖ్య సభ్యులు మరో ఆరు లక్షలు కలిపి మొత్తం రూ.36 లక్షలతో ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇస్తారు.

ఇప్పటి వరకు మొత్తం 600 బస్సులు ఈవిధంగా ఏర్పాటయ్యాయి. త్వరలో మరో 100-150 బస్సులు కొనుగోలుకి రాష్ట్ర ప్రభుత్వం మహిళా సమాఖ్యలకు నిధులు విడుదల చేయబోతోంది.

ఆర్టీసీ నెలనెలా వారికి రూ.69,468 అద్దె చెల్లిస్తోంది. బస్సుల మరమత్తులు, నిర్వహణ వ్యయం కొరకు వారు తిరిగి రూ. 19,468 ఆర్టీసీకి చెల్లిస్తారు. మిగలిన రూ. 50,000 సమాఖ్యలో సభ్యులకు తక్కువ వడ్డీకి అప్పుగా ఇస్తారు.

దాంతో వారు రకరకాల వ్యాపారాలు లేదా అవసరాలకు ఉపయోగించుకుంటారు. ప్రతీ మూడు నెలలకొకసారి వడ్డీల రూపంలో వచ్చిన సొమ్ముని సమాఖ్య సభ్యులు పంచుకుంటారు. లేదా సమాఖ్యలో తమ పెట్టుబడిగా జమా చేస్తుంటారు. 

ఈ పధకంలో అటు ఆర్టీసీ, ఇటు మహిళా సమాఖ్యలు కూడా ప్రయోజనం పొందుతున్నాయి. దీనినే ‘విన్ అండ్ విన్’ అని చెప్పవచ్చు. కానీ అందరూ ఆర్ధిక క్రమశిక్షణ పాటించడం చాలా అవసరం. అప్పుడే ఈ పధకం కూడా డ్వాక్రా సంఘాలు, రైతు బజార్లు మాదిరిగా విజయవంతమవుతుంది.


Related Post