రాష్ట్ర విభజన జరిగిన 12 ఏళ్ళు పూర్తయింది. కానీ నేటికీ విభజన సమస్యలు పరిష్కారం కానేలేదు. వాటిలో ఒకటి ఉద్యోగుల బదిలీలు! నాడు విభజన చట్టం ప్రకారం తెలంగాణకు చెందిన 891 మంది అధికారులు, ఉద్యోగులు ఏపీకి బదిలీ అయ్యారు.
అదేవిధంగా ఏపీకి చెందిన అనేక మంది అధికారులు, ఉద్యోగులు ఏపీకి వెళ్ళిపోవాలని అప్పటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు.
కానీ ఇరు రాష్ట్రాల మద్య నెలకొన్న రాజకీయ సమస్యలు, అనేకానేక ఇతర కారణాల వలన ఈ అంతర్ రాష్ట్ర బదిలీల ప్రక్రియ నేటికీ పూర్తవనే లేదు.
ఏపీలో పని చేస్తూ తెలంగాణ తిరిగి వెళ్ళిపోవాలని కోరుకుంటున్న 891 మంది అధికారులు, ఉద్యోగుల జాబితాని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావుకి శుక్రవారం పంపించారు.
వారిని వెనక్కు తీసుకునే విషయంలో వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకొని తెలియజేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారు.
ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం వారిని ఆయా శాఖలలో సర్దుబాటు చేయగలిగితే వెంటనే ఆమోదం తెలుపుతుంది. అప్పుడు ఏపీ ప్రభుత్వం వారిని డ్యూటీ రిలీవ్ చేస్తూ బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తుంది. కనుక వారి బదిలీలు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంపై ఆధారపడి ఉన్నాయి.