మే 16న పోక్సో కేసులో అరెస్ట్ అయ్యి చర్లపల్లి జైలుకి వెళ్ళిన బండి భగీరథ్‌కు మేడ్చల్- మల్కాజ్‌గిరి న్యాయస్థానం నేడు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇంజనీరింగ్ పరీక్షలకు హాజరయ్యేందుకుగాను బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ బండి భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం సానుకూలంగా స్పందిస్తూ ఈ నెల 26వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
అయితే బెయిల్‌పై బయటకు వెళ్ళినప్పుడు బాధితులను, సాక్షులను కలవడం లేదా బెదిరించడం చేయరాదని, కేసు విచారణని ప్రభావితం చేసే ఎటువంటి పనులు చేయరాదని, మీడియాకి ఇంటర్వ్యూ ఇవ్వరాదంటూ కొన్ని షరతులు విధించింది. తప్పనిసరిగా ఈ షరతులు పాటించాలని ఆదేశించింది. మళ్ళీ ఈ నెల 27న స్వయంగా వచ్చి పోలీసులకు లొంగిపోవాలని న్యాయస్థానం సూచించింది.
ఈ షరతులకు వాటికి బండి భగీరథ్ తరపు న్యాయవాది అంగీకరించడంతో ఈ నెల 26వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జైలు అధికారులకు న్యాయస్థానం నుంచి బెయిల్ ఉత్తర్వులు అందడంతో వాటిని పరిశీలించిన తర్వాత శనివారం మధ్యాహ్నం బండి భగీరథ్‌ని చర్లపల్లి జైలు నుంచి విడుదల చేశారు.