తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని గంగాపూర్ సభలో పాల్గొన్నప్పుడు చెప్పిన కొన్ని విషయాలు అందరినీ ఆలోచింపజేస్తాయి.
“నాడు కేసీఆర్ కరీంనగర్‌లో ఓడిపోతాననే భయంతోనే పాలమూరుకి వచ్చి వలసలు, కరెంట్ కోతలు, కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్‌ఫార్మర్లు, రైతుల ఆత్మహత్యలు, తెలంగాణ ఉద్యమాలు అంటూ మాట్లాడితే ఆయనేదో పార్లమెంటులో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తారను ఎంపీగా గెలిపించారు. గెలిచిన తర్వాత మొక్కుబడి పర్యటన చేసి పోయారే తప్ప మీ సమస్యలను పరిష్కరించనే లేదు.
తెలంగాణ ఏర్పడి పదేళ్ళు కేసీఆర్ పాలన తర్వాత కూడా నేటికీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పధకం పూర్తికాకపోవడమే ఇందుకు నిదర్శనం కదా? దీనిని పూర్తి చేసే బాధ్యత నాదేనని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీని కోసం గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేస్తామన్నారు.
కేసీఆర్‌కి ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుతో పడేది కాదు. కనుక 90 టీఎంసీలు నీళ్ళ గురించి ఆయనతో మాట్లాడేందుకు కేసీఆర్ ఇష్టపడలేదు. కనుక కేసీఆర్ ‘ఇగో’ వలన ప్రాజెక్టుకి, జిల్లా ప్రజలకు అన్యాయం జరిగింది కదా?
చంద్రబాబు నాయుడుతో పడకపోయినా తర్వాత సిఎం అయిన జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఆప్తమిత్రుడే కదా? కానీ ఆయనతో కూడా ఈ పధకం గురించి మాట్లాడలేదు. ఎందుకు?
సిఎం రేవంత్ రెడ్డి ఈ ఎత్తిపోతల పధకం కోసం ఏపీ ప్రభుత్వాన్ని ఒప్పించి 90 టీఎంసీలు నీళ్ళు తెచ్చే బాధ్యత నాదేనన్నారు. అంటే రాష్ట్ర, జిల్లా, రైతుల ప్రయోజనాల కోసం భేషజాలు పక్కన పెట్టి పొరుగు రాష్ట్రంతో మాట్లాడేందుకు సిద్దమని చెపుతున్నరన్న మాట!
జిల్లాలో తుమ్మిడిహెట్టితో సహా అన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత నాదేనని సిఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో చెప్పడం కూడా చాలా సాహసమే అని చెప్పాలి.
ఎందుకంటే వచ్చే ఎన్నికల నాటికి ఈ ప్రాజెక్టు పనులు జోరుగా సాగకపోతే సిఎం రేవంత్ రెడ్డి తమని మభ్యపెట్టారని ప్రజలు భావింఛి కాంగ్రెస్ పార్టీని ఓడించే ప్రమాదం ఉంటుంది. కనుక నిన్న బహిరంగ సభలో సిఎం రేవంత్ రెడ్డి శపధాలు నెరవేరాలంటే తప్పనిసరిగా జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
కనీసం వేగంగా పనులు జరిపించగలిగితేనే ప్రజలు ఆయనని విశ్వసిస్తారు. కనుక సిఎం రేవంత్ రెడ్డి శపధాలు చేసి బీఆర్ఎస్ పార్టీకి సవాలు విసరడమే కాకుండా తనకు, తన ప్రభుత్వానికి అగ్నిపరీక్ష పెట్టుకున్నారని చెప్పక తప్పదు.