ఆషాఢ మాస బోనాల జాతరకు తెలంగాణ సిద్ధమవుతోంది. ఈ ఏడాది ఆషాఢ మాసం జూలై 15న ప్రారంభమై ఆగస్టు 12న ముగియనుంది. నెల రోజుల పాటు కొనసాగే బోనాల ఉత్సవాలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఉత్సవ కమిటీ ప్రతినిధులు ప్రకటించారు.
జూలై 19న గోల్కొండలో తొలి బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అనంతరం జూలై 26న బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయాల్లో బోనాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఆగస్టు 2న పాతబస్తీ లాల్‌దర్వాజ మహంకాళి బోనాలు జరగనున్నాయి.
బోనాల జాతరలో కీలక ఘట్టాలు ఆగస్టు తొలి వారంలో చోటుచేసుకోనున్నాయి. ఆగస్టు 2న ప్రధాన ఆలయాల్లో అమ్మవారికి భారీ ఎత్తున బోనాలు సమర్పించనుండగా, ఆగస్టు 3న సంప్రదాయ రంగం కార్యక్రమం నిర్వహించనున్నారు. భక్తులు ఆసక్తిగా ఎదురుచూసే భవిష్యవాణి కూడా అదే రోజు జరగనుంది.
రంగం అనంతరం అమ్మవారిని అంబారిపై సాగనంపే ఉరేగింపును వైభవంగా నిర్వహించనున్నారు. ఆగస్టు 10న ఉమ్మడి దేవాలయాల ఘటాల సామూహిక ఊరేగింపు, గజరాజుపై అమ్మవారి శోభాయాత్రతో ఆషాఢ బోనాల జాతర ముగియనుంది.