తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళా స్వయం సహాయక బృందాలకు రాయితీపై బస్సులు అందజేసి వాటిని టీఎస్ ఆర్టీసీకు అద్దెకు ఇప్పిస్తోంది. ఈరోజు సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో 553 బస్సులను జెండా ఊపి ప్రారంభించాల్సి ఉంది.
కానీ హటాత్తుగా హైదరాబాద్‌లో కుండపోతగా వాన కురవడం మొదలైంది. కానీ అప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి, మహిళా సంఘాల సభ్యులు ఎదురుచూస్తున్నందున సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు వర్షంలోనే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ చేరుకొని అక్కడ జరిగిన సభలో పాల్గొన్నారు.
సిఎం రేవంత్ రెడ్డి 553 బస్సులను జెండా ఊపి ప్రారంభించగా టీఎస్ ఆర్టీసీఅధికారులు వాటిని స్వీకరించారు. ఈ సందర్భంగా వాటి మొదటి నెల అద్దె సొమ్ముని చెక్కుల రూపంలో సిఎం రేవంత్ రెడ్డి మహిళా సంఘాలకు అందించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క తదితరులు పాల్గొన్నారు.